వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పాలి : విశాఖ ఎంపీ
అంధకారంలోకి వెళ్ళిన రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకుని రావాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు
By Medi Samrat Published on 20 Sep 2024 9:37 AM GMTఅంధకారంలోకి వెళ్ళిన రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకుని రావాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. 2014లో హుద్ హుద్ వస్తే కలెక్టర్ కార్యాలయం బస్సులో ఉండి విశాఖ తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేశారు. మళ్ళీ విజయవాడకు వరదలు వస్తే పది రోజుల పాటు బస్సులోనే ఉండి వరద సహాయక కార్యకలాపాలు చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క దిశా మీటింగ్ పెట్టలేదు.. ఫలితంగా కేంద్ర నిధులు కోల్పోయామన్నారు. రైల్వే జోన్ కి భూమి ఇచ్చాం.. రెండేళ్లలో జోన్ ఆఫీస్ పనిలోకి వస్తుందన్నారు. స్టీల్ ప్లాంటుకు కేంద్రం రూ.500 కోట్లు సహాయం చేసింది. ఉక్కు మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టారని తెలిపారు. విశాఖ కాలుష్య పరంగా మరిన్ని పోర్ట్ గోడౌన్ ల నిర్మాణం చేస్తున్నారు. ఫలితంగా బొగ్గు దుమ్ము ఎగిరి వచ్చే సమస్య తగ్గుతుందన్నారు.
తిరుమల లడ్డు అపవిత్రతపై శ్రీ భరత్ స్పందిస్తూ.. నేషనల్ డైరీ రిపోర్ట్ నేను చూశాను. ఐదు పరీక్షలు చేస్తే, నెయ్యి కాదు అంతకు మించి కొవ్వు పదార్థాలు ఉన్న పదార్థాలుగా తేలాయి. పామాయిల్, ఇతర నిచ్చమైన నూనెలు ఉన్నాయి. వైసీపీ పాలనలో ఎప్పుడు స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చే నంది సంస్థను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఇది చాలా మంది మనోభావాలు దెబ్బ తీసేలా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది చాలా దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లడ్డు విషయం తెలిసింది. పరీక్షలు చేస్తే వాస్తవాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వం ఏ ప్రశ్నకు సమాధానం చెప్పేది కాదన్నారు. గత వైసీపీ హయంలో తప్పులు చేయడమే కాదు.. తప్పులు దాచి పెట్టారన్నారు. తిరుపతి తరహా ఘటనలతో మిగిలిన ఆలయాల్లో కూడా పరిక్షించాల్సిన స్థితి ఉందన్నారు.
భీమిలి సమీపంలోని విజయసాయిరెడ్డి కూతురు భూమి కబ్జాలో జరిగిన నిర్మాణాల కూల్చివేత నాకు తెలియదన్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన విషయం గురించి నేను మాట్లాడను అన్నారు. వ్యవస్థలో జరిగిన ఏ విషయాన్ని వదలం.. భూ కబ్జాలను కచ్చితంగా అరికడతామన్నారు.