విశాఖ జిల్లాలో తహసీల్దార్ ను దారుణ హత్య చేసింది అతడే
విశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2024 8:45 PM ISTవిశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసుపై విశాఖ సీపీ రవిశంకర్ అయ్యర్ మీడియాకు వివరాలు తెలిపారు. తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో ఇద్దరు ఏసీపీలను, నలుగురు ఇన్ స్పెక్టర్లను నియమించి కేసు దర్యాప్తు చేపట్టామని వివరించారు. రియల్ ఎస్టేట్, భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం చేశారు. రమణయ్యపై దాడి అనంతరం నిందితుడు ఎయిర్ పోర్టు వైపు వెళ్లినట్టు గుర్తించామని విశాఖ సీపీ పేర్కొన్నారు. నిందితుడు విమానం ఎక్కినట్టు తెలిసిందని స్పష్టం చేశారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజి పరిశీలించామని, రమణయ్య విశాఖ రూరల్ ఎమ్మార్వోగా పనిచేసినప్పుడు, నిందితుడు పలుమార్లు ఆయన కార్యాలయానికి వెళ్లినట్టు విజువల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని చెప్పారు.
విశాఖలోని కొమ్మాదిలో చరణ్ క్యాస్టల్ అపార్ట్‌మెంట్‌లో తహసీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చాడు. అపార్ట్‌మెంట్ దగ్గర ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు.