ఆంధ్రప్రదేశ్ లో మంకీపాక్స్ కలకలం

Suspected monkeypox case in Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంకీపాక్స్ కలకలం మొదలైంది.

By Medi Samrat  Published on  6 Aug 2022 1:37 PM GMT
ఆంధ్రప్రదేశ్ లో మంకీపాక్స్ కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంకీపాక్స్ కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని GITAM యూనివర్సిటీకి చెందిన విద్యార్థిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఐసోలేషన్‌లో ఉంచారు. స్వాబ్ నమూనాలను సేకరించడానికి ఆరోగ్య శాఖ అధికారులు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు.

మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉండడంతో వైద్యాశాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకున్నారు. నగరంలోని ప్రైవేట్‌ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ కొన్ని రోజులుగా వ్యాధి లక్షణాలతో చికిత్సపొందుతున్నాడని తెలుస్తోంది. శరీరం, వేళ్లపై దద్దుర్లు కనిపించడంతో వైద్య కళాశాల అధికారులు జిల్లా వైద్యులకు సమాచారం అందించారు. దీంతో విషయాన్ని విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన వైద్యాధికారులు వైద్య కళాశాలకు ర్యాపిడ్ రెస్పాన్స్‌ టీంను పంపారు. ఇవాళ ఆ నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు.

వైద్యబృందం వచ్చేలోపే విద్యార్థి భయంతో పారిపోయాడని తెలుస్తోంది. అతడిని మళ్లీ యూనివర్సిటీకి తీసుకొచ్చి, విద్యార్థి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. విద్యార్థి ఇటీవల హైదరాబాద్‌లో ఉండి తిరిగి విశాఖపట్నం వచ్చాడని తెలుస్తోంది. యువకుడికి కేవలం లక్షణాలే ఉన్నాయని.. మంకీపాక్స్ నిర్దాణ కాలేదని.. అయితే తాము అప్రమత్తంగా ఉన్నామని జిల్లా వైద్యశాఖ అధికారులు చెప్పారు. మరోవైపు అధికారులు ఆ విద్యార్థి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శనివారం హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో విద్యార్థిని కలిసినవారి వివరాలను సేకరిస్తున్నారు.


Next Story