రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు విశాఖకు ప్రధాని మోదీ
PM Modi Two days tour in Vizag.రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖ రానున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 11 Nov 2022 9:08 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖ రానున్నారు. బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం జనసేన అధినేత నేత పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్నారు. ఈ నెల 12న(శనివారం) నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రధాని షెడ్యూల్ ఇలా..
- శుక్రవారం రాత్రి 7. 25 గంటలకు ప్రధాని మోదీ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్ చోళాకు వెలుతారు.
- మార్గమధ్యంలో కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకూ బీజేపీ కోర్ కమిటీతో సమావేశం కానున్నారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు. చోళాలోనే రాత్రి బస చేయనున్నారు.
- శనివారం ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి హైలికాఫ్టర్‌లో బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు.
- వేదికపై నుంచి వర్చువల్ గా 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్–విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్. అలాగే రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు, రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల ప్రారంభం, రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్ పైప్‌లైన్ ప్రాజెక్టు, రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం–నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారిని జాతికి అంకితం చేస్తారు. అలాగే.. రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్‌జీసీ యు–ఫీల్డ్. రూ.385 కోట్లతో గుంతకల్‌లో ఐవోసీఎల్ గ్రాస్ రూట్ పీవోఎల్ డిపో నిర్మాణం. రూ.4,106 కోట్లతో విజయవాడ–గుడివాడ–భీమవరం–నిడదవోలు, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం–నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ లు ఉన్నాయి.
- అనంతరం ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నాం 12గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణం అవుతారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.