విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి

విశాఖలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది.

By Medi Samrat  Published on  19 Nov 2024 12:30 PM GMT
విశాఖ లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. స్పందించిన హోం మంత్రి

విశాఖలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి తన సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేయడమే ఆమె పాలిట శాపంగా మారింది. అతడు అతడి స్నేహితులు పెట్టిన హింసకు చివరికి తన ప్రాణాలను తీసుకోవాలని భావించింది.

పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన వంశీ ఆగస్ట్ 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13న డాబా గార్డెన్స్ లోని తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఇక ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్ బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని, లేకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె వంశీ దృష్టికి తీసుకెళ్లింది. వంశీ అతడి స్నేహితులకు అండగా నిలిచాడు. అయితే రోజురోజుకూ ఆమెకు వేధింపులు ఎక్కువవడంతో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. బాధితురాలి తండ్రి ఆమెను అడ్డుకోగా అసలు నిజం బయటకు వచ్చింది. బాధితురాలి తండ్రి వెంటనే విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమీషనర్ తో ఫోన్ లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని హోంమంత్రి పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామ‌న్నారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందన్నారు.

Next Story