ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-కోరాపుట్-విశాఖపట్నం (రైలు నెం. 08538/08537) రోజువారీ ప్యాసింజర్ ప్రత్యేక రైలును శనివారం నుంచి నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు తొలి సర్వీసు రైలును కోరాపుట్ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జునాగఢ్‌ను భద్రాచలం నుంచి నవరంగాపూర్, మల్కన్‌గిరి మీదుగా కలిపే డ్రీమ్ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
రైలు కనెక్టివిటీ ప్రయాణ సౌకర్యాలను పెంపొందించడమే కాకుండా ఈ ప్రాంతం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం-కోరాపుట్ (08538) రైలు సేవలు శనివారం నుండి ప్రారంభమవుతాయి. కోరాపుట్-విశాఖపట్నం (08537) రైలు ఆదివారం నుండి ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ శరద్ శ్రీవాస్తవ, కోరాపుట్ ఎమ్మెల్యే రఘురాం పడాల్, రైల్వే బోర్డు అధికారులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.