ప్రజల పక్షాన నిలబడకపోతే వారి జన్మ వృధా : పవన్ కళ్యాణ్
Janasena leader Pawan Kalyan Speech in Vishakapatnam.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ
By తోట వంశీ కుమార్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా ఆదివారం కూర్మన్నపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. కవి అయినా, కళాకారుడైనా, నాయకుడైనా ప్రజల పక్షాన నిలబడకపోతే వారి జన్మ వృధా అని పవన్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఎంతో భావోద్వేగాలను రగిల్చిందన్నారు. ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ సాకారమైందన్నారు. విశాఖ ఉక్కు కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.
కాగా.. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు ఎంతో ముఖ్యమన్నారు. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్లదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేవారిలో తాను ఒకడినని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారనే వార్త వినగానే ఎంతో బాధకలిగిందన్నారు. వెంటనే ఢిల్లీకి వెళ్లి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం సమర్పించానని చెప్పారు. తనకు ఎమ్మెల్యేల, ఎంపీల బలం లేదని.. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కొని పోయిందన్నారు. ప్రజా బలం ఉండడంతోనే తనకు అమిత్ షా అపాయింట్‌మెంట్ లభించిందనన్నారు.
ఏ పరిశ్రమకు నష్టాలు రాలేవో చెప్పండి? ఏ వ్యాపారానికి నష్టాలు రావో చెప్పండి? ఏ పరిశ్రమకు అప్పులు లేవో చెప్పండి? ఒకవేళ నష్టాలు రాని పరిశ్రమ ఉందీ అంటే అది ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమే అని చెప్పారు.కార్మికుల కష్టాలు కేంద్రానికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. మన ఎంపీలు కేంద్రానికి చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన వాళ్లు గుళ్లో ప్రసాదం తిని బతికారన్నారు. విభజన జరిగినప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని ఎందుకు అడగలేదన్నారు. పార్లమెంట్‌కు వెళ్లేదీ కబుర్లు చెప్పుకునేందుకు కాఫీలు తాగేందుకేనా అని ప్రశ్నిచారు. కేంద్రాన్ని అడిగేముందు రాష్ట్ర పాలకును బాధ్యులను చేయలన్నారు.