పెట్రోల్-డీజిల్ వంటివి ఎంత తొందరగా అంటుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి నిప్పు చాలా దూరంగా ఉంచాలని అంటుంటారు. కానీ కొందరు పొట్ట కూటి కోసం ఉత్సవాల్లో వీటితోనే విన్యాసాలు చేస్తూ ఉంటారు. అందుకు చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు.. అయితే కొన్ని కొన్ని సార్లు జరిగే చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతూ ఉంటుంది. విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో ఇలాంటి ఘటనే చోటు సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని మొహానికి తీవ్రగాయాలయ్యాయి.
అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. మొహం, ఛాతి భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే అతడిని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. గుంపులో ఉన్న మరో వ్యక్తికి కూడా నిప్పు అంటుకుంది.. అయితే అతడికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో చూసి అందరూ షాకవుతూ ఉన్నారు.