విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల.. రేపే బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు.
By Medi Samrat
విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పవిత్ర ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగా వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో క్రైస్తవులు హాజరుకానున్నారు. విశాఖపట్నంలోని జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశాఖపట్నం రోమన్ క్యాథలిక్ అగ్ర పీఠానికి ఉడుముల బాలను అగ్ర పీఠాధిపతిగా ప్రతిష్టాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమం పోప్ ఫ్రాన్సిస్ ప్రతినిధి, భారత్- నేపాల్ అపోస్టోలిక్ నున్సియో(అంబాసిడర్), ప్రాతినిధ్యం వహిస్తున్న మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని పలు చర్చిలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. వీరిలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్, మోస్ట్ రెవరెండ్ కార్డినల్ ఆంథోనీ పూలా ఈ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. బొంబాయి ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఓస్వాల్డ్ కార్డినల్ గ్రేసియస్ ప్రధాన ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్చ్ బిషప్‌లు, బిషప్‌లు, ప్రొవిన్షియల్ సుపీరియర్లు, ప్రీస్ట్స్, మతాధికారులు, ప్రజలు కూడా హాజరవుతారు.
ఆర్చ్ బిషప్ ఉడుమల బాల నేపథ్యం..
డాక్టర్ ఉడుమల బాల వరంగల్‌లోని గూడూరు గ్రామంలో జూన్ 18, 1954న జన్మించారు. కాథలిక్ కుటుంబం నుండి వచ్చారు. ఎనిమిది మంది తోబుట్టువులలో ఆయన ఒకరు. ఆయన అక్కచెల్లెళ్లలో ఇద్దరు నన్స్ గా ఉన్నారు. వరంగల్ ఫాతిమా నగర్‌లోని సెయింట్ పయస్ X మైనర్ సెమినరీలో ఆయన తన అర్చక శిక్షణను ప్రారంభించారు. తరువాత హైదరాబాద్ లోని రామంతపూర్‌లోని సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో థియోలాజికల్ స్టడీస్‌ను పూర్తి చేశారు. ఫిబ్రవరి 20, 1979న ఆయన ప్రీస్ట్(మత గురువు)గా నియమితులయ్యారు.
1979 నుండి 1986 వరకు ఆయన మతసంబంధ పరిచర్య ప్రారంభ సంవత్సరాలు. ప్రజలతో మమేకమవుతూ గడిపారు. ఆ తరువాత ఆయన వివిధ పరిపాలనా బాధ్యతలను చూసుకున్నారు. సెయింట్ జాన్స్ సెమినరీలో కోశాధికారిగా, తరువాత 1994 నుండి 2006 వరకు అక్కడే రెక్టర్‌గా పనిచేశారు. ఆయన విద్యాపరమైన పనులు ఆయనను రోమ్‌కు తీసుకెళ్లాయి. అక్కడ ఆయన క్రైస్తవ నీతిశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేశారు.
భారతీయ చర్చి విభాగంలో గుర్తింపు పొందిన నాయకులైన ఆర్చ్ బిషప్ బాల CCBI డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా (2006–2013), ఆ తరువాత CCBI కమిషన్ ఫర్ వొకేషన్స్, సెమినరీస్, క్లర్జీ అండ్ రిలిజియస్ (2015–2023) ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన 2013లో వరంగల్ బిషప్‌గా నియమితులయ్యారు. 2022 నుండి 2024 వరకు ఖమ్మం అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 8, 2025న, పోప్ ఫ్రాన్సిస్ ఆయనను విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా నియమించారు.