విశాఖ నుంచి పాలనకు రెడీ..!
CM Ready to move vizag for ruling camp office.రాష్ట్రంలో విజయదశమి కీలక మార్పులు తేనుంది. దసరా పండుగ తర్వాత పాలనా
By సునీల్
- దసరాకు సీఎంవో తరలింపు సంకేతాలు
- పార్టీ, కీలక అధికారులకు ఇప్పటికే సమాచారం
రాష్ట్రంలో విజయదశమి కీలక మార్పులు తేనుంది. దసరా పండుగ తర్వాత పాలనా రాజధానికి సీఎంవో తరలనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి అడుగు ముందుకు పడలేదు. ఎప్పటికప్పుడు తరలింపు తప్పదంటూ నాయకుల ప్రకటనలు మినహా ఆ దిశగా జరిగిందేమీ లేదు. అయితే గతంలోనే సీఎం ముఖ్య కార్యదర్శి, పలువురు అధికారులు విశాఖలో సీఎంవో, హెచ్‌వోడీల కార్యాలయాల కోసం పర్యటనలు చేశారు. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భవనాలనూ ఖరారు చేసుకున్నారు.
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తరలి తీరాలనే పట్టుదలతో ఉంది. అసెంబ్లీలో పాసైన చట్టంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావడంతో తరలింపుపై వేచి చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని తరలింపు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్ఆర్సీ వంటి వాటిని న్యాయ రాజధాని అయిన కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైకోర్టు తరలింపుపైనా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.
పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ నుంచి పరిపాలనను సాగించబోతున్నట్లు ఉత్తరాంధ్ర కీలక నేతలు కూడా చెబుతున్నారు. గతంలో రెండు మూడు సార్లు ప్రయత్నాలు, ప్రచారం జరిగినా వివిధ కారణాల వల్ల అడుగు ముందుకు పడలేదు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన సాగిస్తే అదే రాజధాని అని చట్టం చెబుతోందని న్యాయస్థానంలోనూ ప్రభుతవ్ అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యాయపరమైన ఇబ్బందులతో బిల్లును ఉపసంహరించుకున్నా తరలింపునకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి బొత్స పలు వేదికలపై చెప్పారు. అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా విశాఖే పాలనా రాజధాని అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే మరో బిల్లుతో వస్తామని పేర్కన్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బిల్లు తుది దశలో ఉండటంతోనే సెప్టెంబర్ ఒకటిన జరగాల్సిన కేబినెట్ ను ఏడో తేదీకి వాయిదా వేసినట్లు చర్చించుకుంటున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.
సీఎం జగన్ ఇటీవల పర్యటనలను వేగవంతం చేశారు. రెండుమూడుసార్లు ఉత్తరాంధ్రలోనూ పర్యటించారు. ఈ క్రమంలో విశాఖతో పాటు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కూడా పరిపాలనను నిర్వహించనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఆ విధంగా చేస్తే న్యాయపరమైన ఆటంకాలు కూడా ఉండవని భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలను ఎంపిక చేసి ఉంచారు. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలన ప్రారంభిస్తే ప్రస్తుతానికి హెచ్‌వోడీలు తరలి వెళ్తే సరిపోతుందని చెబుతున్నారు. అందుకు ముహూర్తం విజయదశమి తర్వాత ఉండొచ్చని అంటున్నారు.