రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.
By - Medi Samrat |
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.. ఈ సమావేశంలో గత 4 భేటీల్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చ కొనసాగింది. సచివాలయంలోని 2వ బ్లాక్ మంత్రి కందుల దుర్గేష్ పేషీలో సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరవగా.. మంత్రి పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వర్చువల్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయన్నారు. సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం.. హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు.. మొత్తంగా 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించిందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ ఆలోచన చేసిందన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రాపర్ యుటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తోందన్నారు.
ఈ భవనాల నిర్వహణకు తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయని.. ముందుకు వచ్చే సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై కమిటీ చర్చించిందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసమే నెలకు రూ. 25 లక్షల ప్రజా ధనం వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పై అంశాలతో తుది నివేదికను సీఎం చంద్రబాబునాయుడుకు సమర్పిస్తాం.. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ వెల్లడించింది.