వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు భారీ ప్యాకేజీ.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

By Knakam Karthik  Published on  17 Jan 2025 5:12 PM IST
TELUGU NEWS, AP GOVERNMENT, VIZAG STEEL PLANT, SPECIAL PACKAGE, BJP

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు భారీ ప్యాకేజీ.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భారీ ప్యాకేజీ అనౌన్స్ చేసింది. రూ.11,440 కోట్లతో ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.



విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. అయితే ఈ కంపెనీ 2023-24లో రూ.4,848.86 కోట్లు నష్టపోయింది. అంతకు ముందు 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీని ప్రధాన కారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్, స్టీల్‌ప్లాంట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి కుమారస్వామి కూడా ఈ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని ఆయనకు విన్నవించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ప్రభుత్వం ఉక్కుశాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్‌ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడి సరుకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపుల కోసం రూ.1,150 కోట్ల చొప్పున రెండు విడతల్లో సహాయం అందించింది. లేటెస్ట్‌గా రూ.11,440 కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తోందనే ప్రచారంతో సంస్థలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లోనే కొనసాగుతుంది. కంపెనీకి అప్పులు భారీగా పేరుకుపోయాయి. ఆ తర్వాత స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ఐరన్ ఓర్, బొగ్గు సరఫరా బాగా తగ్గిపోయింది. దాంతో ఉత్పత్తి సైతం విపరీతంగా డౌన్ అయిపోయింది. ఆ క్రమంలో నష్టాలను పూడ్చే మార్గం కంపెనీకి లేకుండాపోయింది. చివరకు స్టీల్ ప్లాంట్‌లో పని చేసే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంది. కంపెనీపై ఆధారపడిన వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఓ దశలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం భావించిందనే ప్రచారం జరిగింది. ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాట పట్టడంతో కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు, కేంద్రంతో జరిపిన చర్చలు ప్యాకేజీ ప్రకటనకు దారులు వేశాయి.

Next Story