మహిళా అధికారిపై పెట్రోలు పోసిన ఉద్యోగిని..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2020 11:09 AM GMT
మహిళా అధికారిపై పెట్రోలు పోసిన ఉద్యోగిని..

విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 6 ఆఫీస్ లో కలకలం రేగింది. ప్రభుత్వ మహిళా అధికారిపై పెట్రోల్‌ దాడి ప్రయత్నం సంచలనం రేపింది. ఏఎంహెచ్ వో లక్ష్మీతులసిపై పెట్రోల్ పోసేందుకు శానిటరీ సూపర్ వైజర్ అన్నామణి ప్రయత్నం చేసింది. ఈ దాడి నుంచి లక్ష్మీతులసి తృటిలో తప్పించుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అన్నామణి నుంచి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు.

అన్నామణి గోపాలపట్నం లక్ష్మీనగర్ లో శానిటరీ సూపర్ వైజర్ గా పని చేస్తోంది. 20 రోజులు అన్నామణి డ్యూటీకి రాకపోవడంతో లక్ష్మీతులసి ఆమె జీతం కట్ చేసింది. దీంతో కక్ష కట్టిన అన్నామణి తనపై దాడికి యత్నించిందని లక్ష్మీతులసి ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అన్నామణి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అన్నామణి ఓ కూల్ డ్రింక్ బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకుని.. ఏఎంహెచ్ వో గదిలోకి వెళ్లి.. ఆమె వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ బయటకు తీసింది. అందులోని పెట్రోల్ ను లక్ష్మీతులసిపై చల్లింది. లక్ష్మీతులసి వెంటనే తేరుకోవడంతో ప్రమాదం తప్పిందని సిబ్బంది చెబుతున్నారు. అధికారిణిపై సూపర్ వైజర్ పెట్రోల్ తో దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో లక్ష్మీతులసి భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. జీతం కట్ చేసిందనే కోపంతోనే ఈ దాడి జరిగిందా? లేక మరో కారణమా? అని ఎంక్వైరీ చేస్తున్నారు.

గతంలో తెలంగాణ రాష్ట్రలోని హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో అధికారిణి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Next Story
Share it