Video: తేనెటీగల కారణంగా ఆలస్యంగా వెళ్లిన విమానం..ఎక్కడ అంటే?

సూరత్‌లో ఓ విమానం మాత్రం తేనెటీగల కారణంగా గంటకు పైగా ఆలస్యం అయింది.

By Knakam Karthik
Published on : 8 July 2025 12:39 PM IST

Viral Video, National News, Gujarat, Surat, flightdelayed, Surat, IndiGo

Video: తేనెటీగల కారణంగా ఆలస్యంగా వెళ్లిన విమానం..ఎక్కడ అంటే?

విమాన ప్రయాణాలు ఆలస్యం కావడానికి సాంకేతిక లోపాలు, వాతావరణ సమస్యల వల్లనో కావడం చూస్తుంటాం. కానీ గుజరాత్‌లోని సూరత్‌లో ఓ విమానం మాత్రం తేనెటీగల కారణంగా గంటకు పైగా ఆలస్యం అయింది. దీంతో విమాన ప్రయాణికులు విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే, సూరత్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-784 టేకాఫ్‌కు సిద్ధమైంది. ప్రయాణికులందరూ విమానంలోకి ఎక్కగా, సిబ్బంది వారి లగేజీని లోడ్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో, ఎక్కడి నుంచి వచ్చిందో ఓ తేనెటీగల గుంపు నేరుగా వచ్చి విమానం లగేజీ డోర్‌పై వాలింది. వాటిని చూసి సిబ్బంది మొదట గందరగోళానికి గురయ్యారు.

వాటిని తరిమికొట్టేందుకు సిబ్బంది మొదట పొగ పెట్టారు. కానీ, ఆ తేనెటీగలు అక్కడి నుంచి ఇంచు కూడా కదలలేదు. దీంతో చేసేదేమీ లేక విమానాశ్రయ అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్, లగేజీ డోర్‌పై నీటిని బలంగా చల్లింది. ఆ నీటి ధాటికి తేనెటీగలు ఎగిరిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ అనూహ్య ఘటన వల్ల సాయంత్రం 4:20 గంటలకు బయల్దేరాల్సిన విమానం, గంటకు పైగా ఆలస్యంగా 5:26 గంటలకు టేకాఫ్ అయింది. ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ, "తేనెటీగల సమస్య వల్లే విమానం ఆలస్యమైంది. ఇది మా నియంత్రణలో లేని విషయం. అవసరమైన అన్ని ప్రామాణిక ప్రోటోకాల్స్ పాటించిన తర్వాతే విమానాన్ని నడిపాం" అని వివరించింది.

Next Story