రైలులో చోరీకి య‌త్నం.. తిక్క తీర్చేసారుగా

Robber caught red handed by passengers on moving train.స్టేష‌న్‌లో రైలు ఆగ‌గానే ఓ ప్ర‌యాణికుడి జేబులోంచి సెల్‌ఫోన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sept 2022 11:21 AM IST
రైలులో చోరీకి య‌త్నం.. తిక్క తీర్చేసారుగా

స్టేష‌న్‌లో రైలు ఆగ‌గానే ఓ ప్ర‌యాణికుడి జేబులోంచి సెల్‌ఫోన్ కొట్టేసేందుకు ఓ దొంగ కిటికీ లొంచి య‌త్నించాడు. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికుడు స‌ద‌రు దొంగ చేయిని గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. అదే స‌మ‌యంలో రైలు క‌దిలింది. అలా రైలు బ‌య‌ట దొంగ గాల్లో వేలాడుతూ సుమారు 15 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాడు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. బెగుస‌రాయ్ నుంచి ఖ‌గారియాకు ప్ర‌యాణీకుల‌తో రైలు వెలుతోంది. సాహెబ్‌పూర్ క‌మాల్ స్టేష‌న్ లో రైలు కాసేపు ఆగింది. ఆ స‌మ‌యంలో ఓ దొంగ‌ కిటికీలోంచి ఓ ప్ర‌యాణికుడి సెల్‌ఫోన్‌ను కొట్టేసేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణీకుడు వెంట‌నే దొంగ చేతిని గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. అదే సమయంలో రైలు కదలడంతో దొంగ తనను వదిలేయాలని ప్రాథేయపడ్డాడు.

అయితే.. అప్ప‌టికే రైలు ప్లాట్‌ఫామ్ దాటింది. ప‌ట్టుకోసం రెండో చేతిని కూడా దొంగ కిటికీలోప‌లికి పెట్టాడు. వెంట‌నే మిగతా ప్రయాణీకులు అత‌డి చేతుల‌ను ప‌ట్టుకుని కింద‌ప‌డిపోకుండా చూశారు. ఇలా దాదాపు 15 కిలోమీట‌ర్ల పాటు దొంగ రైలు బ‌య‌ట వేలాడాడు. రైలు ఖ‌గారియా స్టేష‌న్‌లోకి ప్ర‌వేశిస్తున్న స‌మ‌యంలో అత‌డిని విడిచిపెట్టారు. అనంత‌రం అత‌డు పారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దొంగ‌కు స‌రైన గుణ‌పాఠం చెప్పార‌ని కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా.. దొంగ అయినంత మాత్ర‌న అలా వేలాడ‌దీస్తారా అని అంటున్నారు.

Next Story