అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ షేర్ చేసిన వీడియోలో ధుబ్రి జిల్లాలోని హల్దిబారి వద్ద ఒక ఖడ్గమృగం వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. వైరల్ అవుతున్న వీడియోలో వేగంగా వస్తున్న రోడ్డు దాటడానికి రైనో ముందుకు పరుగెత్తింది. లారీ డ్రైవర్ అది గమనించి కాస్త పక్కకు తప్పించాడు. అయినా రైనో వేగంగా పరుగెత్తుకు వచ్చి.. లారీ పక్క భాగంలో బలంగా ఢీకొట్టింది. అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగ నేషనల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది.
హిమంత బిస్వా శర్మ ఈ వీడియో గురించి ట్వీట్ చేస్తూ "ఖడ్గమృగాలు మా ప్రత్యేక స్నేహితులు, అవి నివసిస్తున్న ప్రాంతంలో ఎలాంటి ఉల్లంఘనను మేము అనుమతించము" అని అన్నారు. "హల్దిబారీలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో ఖడ్గమృగం ప్రాణాలతో బయటపడింది.. వాహనంపై జరిమానా విధించబడింది. కజిరంగా వద్ద జంతువులను రక్షించాలనే మా సంకల్పంతో మేము ప్రత్యేక 32-కిమీ ఎలివేటెడ్ కారిడార్‌పై పని చేస్తున్నాము." అని ఆయన చెప్పుకొచ్చారు.
పది సెకన్ల క్లిప్‌లో, ఖడ్గమృగం అటవీ ప్రాంతం నుండి పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై ట్రక్కును ఢీకొంటుంది. ఢీకొట్టిన తర్వాత, ఖడ్గమృగం లేచి, మళ్లీ కిందపడి, తిరిగి అడవిలోకి వెళ్లిపోవడం మనం చూడవచ్చు.