ముంబై బీచ్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా బీచ్‌లకు జనం సరదాగా గడపడానికి వెళ్తుంటారు, కానీ అక్కడ ఒక వ్యక్తి మాత్రం ఎదుటివారి బాధలను వినే వినూత్న 'బిజినెస్' మొదలుపెట్టాడు. తన దగ్గరకు వచ్చే వారి కష్టాలను ఓపిగ్గా వింటూ, అందుకు తగ్గట్టుగా ఫీజు వసూలు చేస్తున్నాడు.
దీనిపై ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆ వ్యక్తి ఆసక్తికర సమాధానమిచ్చాడు. "మీ దగ్గరకు ఎవరైనా వస్తున్నారా?" అని రిపోర్టర్ అడగగా.. "ఖచ్చితంగా వస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు చెప్పుకోవాలంటే రూ.250, పెద్ద పెద్ద కష్టాలు, ఆందోళనలు పంచుకోవాలంటే రూ.500 ఛార్జ్ చేస్తాను. ఒకవేళ బాధ తట్టుకోలేక ఇద్దరం కలిసి ఏడవాలి అంటే మాత్రం రూ.1,000 తీసుకుంటాను" అని బదులిచ్చాడు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తమ మనసులోని మాటను వినేవారు కరువవడంతో, ఇలాంటి వింత వ్యాపారాలకు కూడా డిమాండ్ పెరుగుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.