లక్నోలో ఒక పెళ్లికి పిలవని అతిథి వెళ్ళింది. ఈ అతిథిని చూసి ప్రజలంతా పరుగులు పెట్టారు. భయంతో పారిపోయారు. పెళ్లి హాల్ ఆవరణలోకి చిరుతపులి రావడంతో వేడుకలు కాస్తా గందరగోళంగా మారాయి. నగరంలోని ఎంఎం లాన్ హాల్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాహ వేదిక దగ్గరకు చిరుతపులి రావడంతో వందలాది మంది అతిథులు వీధుల్లోకి పరుగులు తీశారు. భయంతో పైకప్పు నుండి దూకి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న కొద్దిసేపటికే, పోలీసు బృందం, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించే ముందు పెళ్లికి హాజరైన వారందరినీ ఖాళీ చేయించారు. బాంక్వెట్ హాల్‌లోని లాక్ చేసిన ప్రాంతంలోకి రైఫిల్స్‌తో పోలీసు అధికారుల బృందం వెళ్ళింది. మెట్ల వద్ద చిరుతపులి అడ్డుకుంది. అధికారులు ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చి, ఆ తర్వాత మళ్లీ తాళం వేశారు.
రాత్రిపూట ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చిరుతపులిని పట్టుకున్నారు. అనంతరం బోనులోకి ఎక్కించారు.