తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ 28, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గూడలూరు-ఊటీ జాతీయ రహదారి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్‌లోకి ఓ చిరుతపులి మెల్లగా ఎంట్రీ ఇచ్చిన దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. మెల్లగా పీఎస్ లోపలికి వచ్చి ఇన్‌స్పెక్టర్ కూర్చున్న గది చుట్టూ తిరిగింది. అదే సమయంలో, మరొక గదిలో విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి గదిలో చిరుతపులి తిరగడం చూసి షాక్ అయ్యాడు. భయంతో శబ్దం చేయకుండా మౌనంగా అక్కడే నిలబడిపోయాడు.
ఇక గది మోత్తం తిరిగి చూసి తినడానికి ఏమీ లేకపోవడంతో, చిరుతపులి తిరిగి మెట్లు దిగి, వచ్చిన దారిలోనే బయటకు వెళ్లిపోయింది. దీంతో పులి ఉందా వెళ్లి పోయిందానని తలుపు గుండా తొంగి చూశాడు. పులి వెళ్లిపోవడంతో అమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే పీఎస్ తలుపులు మూసేసి తాళం వేశాడు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, నడువట్టం ప్రాంతంలో చిరుతల సంచారం ఇటీవల ఎక్కువైందని, అటవీ శాఖ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.