Fact Check : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రి బిల్లులు కుటుంబ సభ్యులు కట్టలేదా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2020 7:28 AM GMT
Fact Check : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసుపత్రి బిల్లులు కుటుంబ సభ్యులు కట్టలేదా..?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం నుండి ఇంకా ఎవరూ తేరుకోలేదు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. సెప్టెంబర్ 25వ తేదీన మద్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌తో పాటు ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన తిరిగి అనారోగ్యం పాలై సెప్టెంబర్ 25వ తేదీన కన్నుమూశారు.



ఇంతలో ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ సరిగా జరగలేదని, ఆసుపత్రి బిల్లు ఇదే అంటే సోషల్ మీడియాలో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.



బాలు ఆసుపత్రి చికిత్సకు 51 రోజుల్లో మూడు కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అయిందని.. 1.85 కోట్ల రూపాయలు బాలసుబ్రహ్మణ్యం కుటుంబం చెల్లించాల్సి ఉందని.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన వాళ్లు పట్టించుకోకుండా ఉంటే.. ఎంజీఎం హాస్పిటల్‌ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలు వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

నిజ నిర్ధారణ:

బాల సుబ్రహ్మణ్యం కుటుంబం ఆసుపత్రి బిల్లులు కుటుంబ సభ్యులు కట్టలేదన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి, బాలు ఫ్యామిలీకి మధ్య వివాదం నడిచిందనే వార్తల నేపథ్యంలో ఎస్పీ చరణ్‌ స్పందించారు. కొంత మంది కావాలని

అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో నాన్నగారి ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

''ఆసుపత్రిలో నాన్నగారి ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. హాస్పిటల్ బిల్లు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రి మంచి చికిత్స అందించింది. మాకు, వాళ్ళకి ఎలాంటి వివాదాలు లేవు. దయచేసి ఇలాంటి ప్రచారం చేయకండి. నాన్నగారిని అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదు, ఈ టైమ్‌లో ఇలాంటి రూమర్స్ మమ్మల్ని మరింతగా బాధపెడతాయి. దయచేసి గమనించండి'' అని ఎస్పీ చరణ్ చెప్పుకొచ్చారు.

ఆసుపత్రి బోర్డు మెంబర్ కూడా ఈ వదంతులను ఖండించారు. ఈ వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం కూడా లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేయడానికి ఇది సరైన సమయం కాదు. మేము తమిళవాళ్ళము.. బాల సుబ్రహ్మణ్యం గారికి పెద్ద అభిమానులు.. వారి నుండి మాకు ఒక్క పైసా కూడా అవసరం లేదని అన్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ కూడా ఈ వదంతుల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు.

ఈ వదంతులపై ఎస్పీ చరణ్ ఇచ్చిన వివరణను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి.

బాల సుబ్రహ్మణ్యం కుటుంబం ఆసుపత్రి బిల్లులు కుటుంబ సభ్యులు కట్టలేదని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story