Fact Check : నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయంటూ వైరల్ అవుతున్న మెసేజీ.. ఎంత వరకూ నిజం..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2020 3:16 PM ISTఅవయవదానం అన్నది ఎంతో గొప్పది అంటూ చెబుతూ ఉంటారు. ఆ అవయవదానాన్ని వ్యాపారంగా మార్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయంటూ మెసేజీలు వైరల్ అవుతూ ఉన్నాయి.
"ప్రియమైన అందరికి
ముఖ్యమైనది, 4 కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి.
మిస్టర్ సుధీర్ మరియు అతని భార్య (నా స్నేహితుడి సేవా సహచరులు) మరణం కారణంగా నిన్న ఒక ప్రమాదంతో కలుసుకున్నారు, డాక్టర్ వారిని బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. మిస్టర్ సుధీర్ B + మరియు అతని భార్య O +. అతని కుటుంబం వారి కిడ్నీలను మానవత్వం కోసం దానం చేయాలనుకుంటుంది .Plz సర్క్యులేట్.
9837285283
9581544124
8977775312 ను సంప్రదించండి. మరొక సమూహానికి ఫార్వార్డ్ చేయండి, ఇది ఎవరో ఒకరికి సహాయపడుతుంది ..." అంటూ వైరల్ అవుతున్న మెసేజీని ఫార్వర్డ్ చేయాలని కోరుతూ ఉన్నారు.
�
�
ఈ మెసేజీ ఎంత వరకూ నిజమో తెలియజేయాలంటూ న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ వచ్చింది.
నిజ నిర్ధారణ:
ఈ వైరల్ మెసేజీలో ఎటువంటి నిజం లేదు.
ఈ వైరల్ పోస్టు గత రెండేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. అచ్చం ఇదే మెసేజీని 2018, 2019 సంవత్సరాల్లో కూడా పలువురు ట్వీట్ చేశారు.
వైరల్ అవుతున్న మెసేజీలో ఉన్న ఫోన్ నంబర్స్ ను న్యూస్ మీటర్ సంస్థ కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించగా.. ఓ నెంబర్ రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రెండో నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మూడో నెంబర్ మనుగడలో లేదని తెలిసింది.
ది హిందూలో ఈ మెసేజీకి సంబంధించిన వార్త వచ్చింది. అందులో ఉన్న నెంబర్ మీరట్ కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గార్గ్ కు చెందినదిగా తెలుస్తోంది. ఈ మెసేజీలో ఆయన నెంబర్ ను చేర్చగానే పెద్ద ఎత్తున ఆయనకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. తమ కుటుంబ సభ్యులకు కిడ్నీలు పాడయ్యాయి.. మీరు సహాయం చేయగలరా అంటూ పలువురు ఆయనకు కాల్స్, మెసేజీలు చేశారు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ కూడా డాక్టర్ సందీప్ కుమార్ గార్గ్ ను సంప్రదించి అందులోకి ఆయన నెంబర్ ఎలా వచ్చింది అన్న దానిపై ఆరాతీశారు. ఆయన కూడా దీనిపై తనకేమీ తెలీదని చెప్పుకొచ్చారు. ఇదొక గాలి వార్త అని అధికారులు కొట్టివేయడమే కాకుండా ఈ పని చేసింది ఎవరన్న దానిపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఘటనపై ది హిందూ మరో ఆర్టికల్ ను రాసింది. ప్రజల్లో గందరగోళం తీసుకుని రావడానికే ఈ మెసేజీని సృష్టించారని తెలిపింది. అవయవాలను వాట్సప్ లేదా సామాజిక మాధ్యమాల ద్వారా డొనేట్ చేయడం తప్పని.. ఈ విషయం చదువుకున్న వారికి కూడా తెలీకపోవడం దురదృష్టకరమని ట్రాన్స్ప్లాంట్ సర్జన్ తెలిపారు.
SM Hoax Slayer కూడా ఈ వైరల్ మెసేజీలో ఎటువంటి నిజం లేదని.. ఓ గాలి వార్త అని కొట్టేసింది.
నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.