Fact Check : బాబ్రీ మసీదు స్థానంలో 'బాబ్రీ ఆసుపత్రిని' నిర్మించాలని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించిందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 3:00 PM IST
సామాజిక మాధ్యమాల్లో రెండు ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో 'ఒకటి సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జఫర్యాబ్ జిలానీది కాగా.. మరో ఫొటోలో పెద్ద బిల్డింగ్ ఉంది.. ఆ బిల్డింగ్ కు 'బాబ్రీ ఆసుపత్రి' అన్న పేరు ఉంది.'
We welcome the decision of the Sunni Waqf Board to set up a Babri Hospital and Museum on 5 acres of land in Ayodhya allotted by the Supreme Court. People of all faiths All religions will benefit from this great decision which has gone beyond narrow religious sentiments pic.twitter.com/6QfoNhlI9w
— Rayees Ahmad Malik (@RayeesAhmad01) August 7, 2020
'సున్నీ వక్ఫ్ బోర్డు బాబ్రీ ఆసుపత్రిని నిర్మించాలని భావిస్తోంది. అయోధ్యలో సుప్రీంకోర్టు ఇచ్చిన 5 ఎకరాల స్థలంలో ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. ఆసుపత్రిని నిర్మిస్తే కులమతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ లాభం పొందుతారు. ఇదొక గొప్ప నిర్ణయం.' అన్న పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మరికొందరు.. బిల్డింగ్ కు సంబంధించిన ఫోటోను అప్లోడ్ చేసి.. 'మాకు మసీదు అవసరం లేదు. ఆసుపత్రి, విద్య కావాలి. బాబ్రీ మసీదును భారత్ లో ఎక్కడైనా నిర్మించవచ్చు. సున్నీ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనది.. ఈ నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. 5 ఎకరాల్లో బాబ్రీ ఆసుపత్రిని నిర్మించాలని సున్నీ వక్ఫ్ బోర్డు అనుకోవడం గొప్ప విషయం' అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
బాబ్రీ మసీదు స్థానంలో బాబ్రీ ఆసుపత్రిని నిర్మించాలని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించిందన్నది 'పచ్చి అబద్ధం'
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం సున్నీ వక్ఫ్ బోర్డు ఓ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయిదు ఎకరాల స్థలంలో మసీదును నిర్మించాలని అనుకుంటూ ఉన్నారు.
అక్కడ ఆసుపత్రి, లైబ్రరీ, ఇండో-ఇస్లాం రీసెర్చ్ సెంటర్ లతో పాటూ మసీదును నిర్మించాలన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై సున్నీ వక్ఫ్ బోర్డు ఎటువంటి అధికారిక ప్రకటనను వెలువరించలేదు. వైరల్ అవుతున్న పోస్టులలో ఉన్న బిల్డింగ్ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న బిల్డింగ్ ఫోటోను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా వెబ్సైటు లోనూ, వారి లింక్డ్ ఇన్ పేజీలోనూ చూడొచ్చు.
ఆ ఫోటోను తీసుకుని ఫోటోషాప్ లో బాబ్రీ ఆసుపత్రి, డిపార్ట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కరోనా అన్న పేర్లను ఉంచారు.
వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్న బిల్డింగ్ 'బాబ్రీ ఆసుపత్రి' కాదు.. సున్నీ వక్ఫ్ బోర్డు మసీదు స్థానంలో ఆసుపత్రి నిర్మించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదు.