Fact Check : శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేయలేదా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 7:27 AM GMT
Fact Check : శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేయలేదా..?

ఆగష్టు 15న భారత్ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. దేశం లోని పలు చోట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. సామాజిక మాధ్యమాల్లో జాతీయ జెండాను ఎగురవేసిన పలు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

అందులో ఒకటి శ్రీనగర్ లోని లాల్ చౌక్ ఫోటో. 'గంటా ఘర్ ' పైన జాతీయ జెండాను ఎగురవేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. అంతకు ముందు అక్కడ పాకిస్థాన్ జెండాలను ఎగురవేసేవారని.. ఇప్పుడు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఉందని పలువురు పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలను పెద్ద ఎత్తున వైరల్ చేశారు.

బీజేపీ నేతలు అయిన కపిల్ మిశ్రా, కిరణ్ ఖేర్, జమ్యాంగ్ నాంగ్యల్ లు తమ సామాజిక ఖాతాల్లో ఈ ఫోటోలను పోస్టు చేశారు. “Tiranga at Lal Chowk” లాల్ చౌక్ ప్రాంతంలో మువ్వన్నెల జెండా అంటూ ట్వీట్లు పెట్టారు.

News Nation, Dainik Jagran లాంటి సంస్థలు కూడా ఇదే ఫోటోను పోస్టు చేశాయి. 'భారత జాతీయ పతాకాన్ని లాల్ చౌక్ లో ఎగురవేయాలంటే ఎంతో హింస జరిగేది.. అలాంటిది ఈరోజు ఎంతో ప్రశాంతంగా లాల్ చౌక్ ప్రాంతం ఉంది' అంటూ న్యూస్ నేషన్ సంస్థ ప్రచురించింది.

నిజ నిర్ధారణ:

లాల్ చౌక్ లోని గంటా ఘర్ పైన మువ్వన్నెల జెండా రెపరెపలాడిందంటూ వైరల్ అవుతున్న ఫోటోలు 'ఫేక్'. ఈ ఫోటోలు నిజమైనవి కావు.

ఈ ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2010 కాలం నాటి ఫోటో లభించింది. పాత ఫోటోకు మువ్వన్నెల జెండాను ఫోటోషాప్ లో అతికించారు. మార్ఫింగ్ చేసిన ఫోటో అని స్పష్టమవుతోంది. ముబాషిర్ ముస్తాక్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు 2010లో తన బ్లాగ్ లో ఈ ఫోటోను పోస్టు చేశారు. కపిల్ మిశ్రా ట్వీట్ కు సమాధానం చెబుతూ తాను జూన్ 22, 2010న ఈ ఫోటోను తీశానని వెల్లడించారు.

01

రెండు ఫోటోలను బాగా గమనిస్తే నడుస్తున్న వ్యక్తి, అక్కడ పార్క్ చేసిన వాహనాలను చూడొచ్చు. మొదటి ఫోటోను మార్ఫ్ చేసినట్లుగా అర్థమవుతుంది.

ఒకప్పటి ఫోటోకు ఇప్పటి ఫొటోకు సంబంధించిన తేడాను ఇండియా టుడేకు చెందిన లోకల్ కరస్పాండెంట్ షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఫోటో కు ఇప్పటికి చాలా తేడాలు గమనించవచ్చు. ఆగష్టు 15, 2020కి చెందిన ఫోటోలో బిల్డింగ్ రూపు రేఖలు మారిపోవడాన్ని చూడచ్చు. అలాగే గంటా ఘర్ ముందు కూడా చాలా మార్పులను గమనించవచ్చు.

02

ఎడమవైపున ఉన్న ఫోటో ఆగష్టు 15, 2020న తీసినది.

ఇండియా టుడేకు చెందిన ఫోటో జర్నలిస్ట్ తారిఖ్ అహ్మద్ లాల్ చౌక్ లో ఈ ఏడాది జాతీయ జెండాను ఎగురవేయలేదని స్పష్టం చేశారు. నేను ఆగష్టు 15 ఉదయం లాల్ చౌక్ దగ్గరకు వెళ్లాను. అక్కడ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగలేదు. గంటా ఘర్ మీద మువ్వన్నెల జెండా ఎగురవేయలేదు. శ్రీనగర్, కాశ్మీర్ లోని ఇతర ప్రాంతాల్లో కఠిన నిబంధనలను అమలుచేశారని తారిఖ్ అహ్మద్ తెలిపారు.

ఆగష్టు 15న శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారన్నది 'అబద్ధం'.

Next Story