పల్లె కంగారు పడతుందో.. కనిపించని కరోనాతో..

By మధుసూదనరావు రామదుర్గం  Published on  3 Aug 2020 9:56 AM GMT
పల్లె కంగారు పడతుందో.. కనిపించని కరోనాతో..

నగరాలు, పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా జాన సాంద్రత పేరుకుపోవడం వల్ల కరోనా వ్యాప్తి వేగంగానే కాదు భీకరంగానూ ఉంటోంది. కరోనా కమ్యూనిటీ వ్యాప్తి మొదలైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట్లో ఆ ఏరియాలో ఈ ఏరియాలో అంటూ వచ్చే వార్తలు కాస్త ఆ కాలనీలో ఈకాలనీలో అంటూ చెబుతున్నాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో అనాల్సి వస్తోంది. కొద్ది రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ, పరిసర జిల్లాలు తప్ప ఎక్కడా రెచ్చిపోని కరోనా తాజాగా జిల్లాల్లో తన ప్రతాపం చూపుతోంది.

ఆరోగ్యశాఖ అధ్యయనం ప్రకారం 270 మండలాల పరిధిలోని 1500 గ్రామాలకు ఈ వైరస్‌ వచ్చిందని తెలుస్తోంది. నిన్న మొన్నటి దాకా రోజూవారీ కరోనా కేసుల్లో అధికభాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండేవి. కానీ ఇప్పుడు పల్లెలు పోటీ పడుతున్నాయి. పల్లెల్లో వేలకొద్ది కేసులుండటం కలవర పరుస్తోంది. ఇది ప్రాథమిక దశ. నివారణ చర్యలు తీసుకోకపోతే మున్ముందు భారీ సంఖ్యలో కేసులు వచ్చే వీలుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ మారిన పరిస్థితికి కారణాలేంటి?

వలసలే ప్రధాన కారణమా..

కరోనా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందన్నది జగద్విదితం. పల్లెల్లో ఈ దుస్థితికి కారణం బైటనుంచి జనాలు రావడమే! హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో కరోనా పెచ్చుమీరి రెచ్చిపోవడమే కాకుండా లాక్‌డౌన్‌ వల్ల బడుగు కూలీలు, చిరుద్యోగులకు ఉపాధి ఉఫ్‌ మంది. నాలుగు కాసులు సంపాదించి పల్లల్లో ఉంటున్న తమ కుటుంబానికి కాసింత సాయం చేయాలని పొట్టచేతబట్టుకుని నగరానికి వచ్చిన చాలామంది పేదలు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయారు.

‘ప్రభుత్వ వైద్యసాయం అందడంలేదు.. ప్రైవేటు ఆస్పత్రుల వైపు చూసేంత సొమ్ము కూడా లేదు. ఉపాధి ఊడిపోయింది. సంపాదన కరవైనపుడు ఇక ఈ నగరాల్లో ఉండటంలో అర్థం లేదు. కనీసం మా ఊళ్ళకు చేరుకుంటే అందరితో కలిసి కలోగంజో తాగి బతకవచ్చ’ని సొంతూళ్ల బాట పట్టారు. చిరుద్యోగులు, దిగువ మధ్యతరగతి వాళ్లు కూడా కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు ఉష్‌కాకి కావడంతో అప్పులు చేసి ఇక్కడ బతకడం కన్నా మా ఊరికి వెళ్ళడమే మంచిదని అనుకున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలోనే రవాణా కరవైన ఆ క్లిష్ట సమయంలోనే లక్షలాది మంది పేదలు కాలినడక షురూ చేశారు. ఈ పరిణామాల్ని అంచనా వేయలేక పోయిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విమర్శలకు లోనయ్యాయి. భారత్‌ నడుస్తోంది అంటూ మీడియా సోషల్‌ మీడియాలో అనేక హృదయవిదారక గాధలు రావడంతో సోనూసూద్‌ లాంటి మానవతావాదులెందరో తమ శక్తి మేరకు వలసకార్మికులకు భోజనాలతోపాటు రవాణా వసతులు కల్పించారు. సొంతంగా బస్సులు ట్రాక్టర్లు, ఏది వీలైతే ఆ వాహనాన్ని సమకూర్చారు.

కేంద్ర ప్రభుత్వం త్వరగా మేల్కొని శ్రామికరైళ్ళు వేసింది. కొందరు సొంత సొమ్ముతో ప్రైవేటుగా రైళ్ళు ఏర్పాటు చేసి మరీ కార్మికులను వారి పల్లలెకు పంపించారు. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా నగరంలో కోవిడ్‌ వస్తే తాము అనాథలుగా బలి కావల్సిందే కనీసం పట్టించుకునే నాథుడుండనే ఆందోళనతో టాక్సీలు బుక్‌ చేసుకుని మరీ వెళ్ళిపోయాయి. వెళ్ళినవారిలో ఎంతమంది కరోనా సోకినవారున్నారో లెక్కతేలలేదు.

దీంతో పల్లెలకు వెళ్ళిన వారు కూడా ఈ కరోనా వ్యాప్తికి కారకులుగా మారుతున్నారని తాజా అధ్యయనం. అదీకాకుండా నగరాల్లో పట్టణాల్లో కట్టడిచేస్తున్నట్టుగా పల్లెల్లో చర్యలు తీసుకోవడం లేదు. అప్పటికీ కొన్ని పల్లెలు ఇరుగుపొరుగు వారు రాకుండా ఊరిబైట కంచెలు వేసి కాపలాలు కాసి మరీ అడ్డుకోడానికి ప్రయత్నించారు. కానీ ఎంతకాలమని ఇలా కాపలా కాయగలరు? నగరాలు వదలి ఊళ్ళకు వచ్చిన తమవారిని కాదనగల శక్తి వారికెక్కడుంది? ఇవి చాలవన్నట్లు వర్షాకాలం రావడంతో పొలం పనులు ఊపందు కున్నాయి. పొలంలో పనిచేసే కుటుంబాలు చాలా వరకు భౌతికదూరం పాటించడం లేదు.

వ్యవసాయం ప్రారంభం కాగానే విత్తనాల కోసమో. పురుగుల మందుకోసమో, రసాయన ఎరువుల కోసమో చాలా మంది గ్రామస్థులు తమ సమీప పట్టణాలకు నగరాలకు రాకపోకలు ప్రారంభించారు. సామాజిక వ్యాప్తికి ఈ కారణాలే చాలు. ఈ మారుతున్న పరిస్థితిని గమనించిన ప్రభుత్వం పల్లెలో కరపత్రాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకుంది. కరోనా నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేపట్టనుంది.

ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ పలు నిర్ణయాలు వెల్లడించింది..

– కరోనా అనుమానితులు ఉంటే వెంటనే పీహెచ్‌సీకి తీసుకెళ్ళాలి. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించాలి.

– పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఏరియా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అవసరమై మందులు, పరీక్ష సామగ్రి సమకూర్చుకోవాలి.

– కొత్తగా వస్తున్న108 అంబులెన్సులను పల్లెబాట పట్టించాలి.

–అత్యవసర కేసులుంటే సమీప ఆస్పత్రికి తీసుకొచ్చేలా జిల్లా వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

పై నిర్ణయాలు సక్రమంగా, సకాలంలో అమలుకాగలిగితే కొంతవరకైనా పల్లల్లో కరోనా కట్టడి సాధ్యపడుతుంది. లేకుంటే.. పల్లె కంగారుపడుతోందో.. కనిపించని కరోనాతో అన్న కన్నీటి పాటలు వినాల్సి వస్తుంది.

Next Story