నెలకు రూ. కోటి సంపాదించేవాడు.. పెద్దగా ఎంజాయ్ చేసేవాడు కాదట..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 July 2020 1:09 PM IST
నెలకు రూ. కోటి సంపాదించేవాడు.. పెద్దగా ఎంజాయ్ చేసేవాడు కాదట..?

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వికాస్ దూబే ఏకంగా కోటి రూపాయలు ప్రతి నెలా ఆర్జించే వాడని తెలుస్తోంది. అలాగని వికాస్ దూబే జల్సాలకు అలవాటు పడలేదట.. మందు సిగరెట్ వంటివి కనీసం తాకే వాడు కాదని నేషనల్ మీడియా తాజాగా వికాస్ దూబేకు సంబంధించిన విషయాలను వెల్లడించింది.

వికాస్ దూబేకు ఎంతో సింపుల్ గా ఉండడమే ఇష్టమట.. అతడి బ్యాంకు అకౌంట్లలో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు లేవని అధికారులు గుర్తించారు. దీంతో దూబే అనుచరులపై అధికారులు నిఘా ఉంచారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వికాస్ దూబే సన్నిహితుల బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను గమనిస్తూ ఉన్నారు.

ఈడీకి అందిన సమాచారం ప్రకారం దూబేకు ప్రతినెల 90 లక్షల రూపాయల నుండి 1 కోటి 20 లక్షల రూపాయల ఆదాయం లభించేది. ఆ డబ్బును దూబే ఎప్పుడు కూడా జల్సాలకు వినియోగించలేదు. విదేశాల్లో టూర్లకు కూడా వెళ్లలేదు. ఖరీదైన వస్తువులను కూడా వికాస్ దూబే ఎప్పుడూ కొనలేదని తెలుస్తోంది. దూబే తాను ఆర్జించిన డబ్బును ఎవరెవరికి ఇచ్చాడో, దేనిలో పెట్టుబడి పెట్టాడో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దూబేకు దగ్గరి వ్యక్తులు ఎవరు, వారు చేస్తున్న వ్యాపారాలు ఎటువంటివి లాంటి లిస్టును అధికారులు తయారు చేసినట్లు తెలుస్తోంది.

జులై 3న బిక్రూ గ్రామంలో వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లగా.. వారి మీద తన గ్యాంగ్ తో కలిసి కాల్పుల వర్షం కురిపించాడు వికాస్ దూబే.. ఈ ఘటనలో 8 మంది పోలీసులు మరణించారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. వికాస్ దూబేను పట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. ఎలాగోలా యోపీ నుండి బయటకు వచ్చేసిన దూబే తప్పించుకుంటూ తిరుగుతూ జులై 9న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించారు.

జులై 10 ఉదయం కాన్పూర్ కు తీసుకుని వెళుతూ ఉండగా పోలీసు వాహనానికి యాక్సిడెంట్ అవ్వడంతో ఆ కారులో నుండి తప్పించుకుని వెళ్ళడానికి వికాస్ దూబే ప్రయత్నించాడు.. కానిస్టేబుల్ తుపాకీ తీసుకుని పారిపోవాలని ప్రయత్నించిన వికాస్ దూబేను పోలీసులు లొంగిపొమ్మని అడగ్గా.. అతడు వినకపోవడంతో పోలీసులు కాల్చి చంపాల్సి వచ్చింది.

Next Story