విజయవాడ గ్యాంగ్‌ వార్‌ కేసులో 13 మంది అరెస్టు : సీపీ తిరుమలరావు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2020 12:13 PM GMT
విజయవాడ గ్యాంగ్‌ వార్‌ కేసులో 13 మంది అరెస్టు : సీపీ తిరుమలరావు

విజయవాడ పడమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ వార్‌ కేసు విచారణ పూర్తి అయ్యింది. రెండు గ్రూపుల మధ్య ఓ స్థల వివాదం గ్యాంగ్‌ వార్‌కు దారి తీసిందని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గ్యాంగ్‌ లీడర్‌ పండుతో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు. సీసీ పుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించామని త్వరలోనే మిగిలిన వారిని అరెస్టు చేస్తామన్నారు.

గతంలో పండు, సందీప్‌ ఇద్దరు మంచి స్నేహితులని, యనమలకుదురులోని 7 సెంట్ల స్థల వివాదం కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నారు. ప్రదీప్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి మధ్య అపార్టుమెంట్‌ నిర్మాణంలో వివాదం తలెత్తింది. శ్రీధర్‌రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్‌రెడ్డి నాగబాబును ఆశ్రయించాడు. వివాదం పరిష్కారం కోసం గతనెల 29న సందీప్‌, పండును పిలిపించారు. నాగబాబు, సందీప్‌లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు. దీంతో పండుకు వార్నింగ్‌ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్‌ ఫోన్‌లో బెదిరించే యత్నం చేశాడు. సెటిల్‌మెంట్‌కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీశాడు. 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్‌ బెదిరించారని, ఆ తర్వాత 30న ఉదయం పండు అనుచరులు సందీప్‌ షాపుకు వెళ్లారన్నారు. సందీప్‌ షాపులో ఉన్న అనుచరుడిని పండు గ్యాంగ్‌ కొట్టింది. మాట్లాడుకుందాం అని పిలుచుకుని.. 31వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయని తెలిపారు.

'సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోగా రెండు గ్రూపులకు చెందిన వారు కత్తులు, రాళ్లతో తీవ్రంగా కొట్టుకున్నారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన తోట సందీప్‌ మరుసటి రోజు చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ మృతిచెందాడు. డీసీపీ హర్షవర్ధన్‌ ఆధ్వర్యంలో 6 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించాం. ఈనెల 4న రాత్రి ప్రశాంత్, రవితేజ, ప్రేమ్‌కుమార్‌, ప్రభుకుమార్‌, శ్రీను నాయక్‌లను అరెస్టు చేశాం. ఈ రోజు ఉదయం మరో 8 మందిని అరెస్టు చేశాం. నిందితుల నుంచి కత్తులు, కోడికత్తులు, రాడ్డు స్వాధీనం చేసుకున్నామ'న్నారు. విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుతున్నామని, ఇకపై విజయవాడలో గ్యాంగ్‌ వార్‌లు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Next Story