వివేకా హత్య కేసులో కొత్త పరిణామం
YS Vivekananda Reddy murder case has taken another crucial turn.వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 29 Nov 2021 10:24 AM GMT
అనంతపురం: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కలిశాడు. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలని బాధితుడు గంగాధర్ రెడ్డి ఎస్పీని కోరాడు. రూ.10 కోట్ల ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందన్న గంగాధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిళ్లు తెచ్చారని.. వారి ఒత్తిడితో తానే చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులు చేశారని చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని.. లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేదిలేదని గంగాధర్ రెడ్డి అన్నారు.
ఈ విషయమై ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. గంగాధర్ రెడ్డికి రక్షణ కల్పిస్తామని అన్నారు. సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశారని.. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ చెబుతున్నారని.. గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ చేస్తామని ఫక్కీరప్ప తెలిపారు.