పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాల్లో ఇటీవల దూకుడు పెంచారు. పలు ప్రాంతాలను సందర్శించి జనసేన పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపారు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ మన నాయకుడు వంగవీటి రంగాయేనని, తరతరాలకు ఆయనే మన నాయకుడని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. మన నాయకుడు వంగవీటి రంగాను మనం ఒకప్పుడు కాపాడుకోలేకపోయామని, కానీ ఇప్పుడు ఆలోచన, ఆవేశం ఉన్న మన నాయకుడు పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పుట్టిన కులాన్ని తిట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయిందన్నారు. కులాన్ని తిట్టడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలనే కూల్చేయగల గొప్పదనం ఈ కులంలో ఉందని.. కాబట్టి ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రంగా ఒక కులానికి ఆరాధ్య దైవమని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కులం, మతం చూడకుండా ఆదుకోవడమే రంగాగారి గొప్పతనమని, అందుకనే ఆయనకు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని రాధాకృష్ణ అన్నారు. అక్కడే ఉన్న వాళ్లు జై జనసేన అంటూ నినాదాలు చేశారు.


సామ్రాట్

Next Story