విజయవాడకు వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

Vande Bharat Super Fast Express to Vijayawada. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే వందేభారత్‌ సెమీ హై స్పీడ్‌ రైలు విజయవాడకు

By Medi Samrat  Published on  19 Dec 2022 10:29 AM GMT
విజయవాడకు వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే వందేభారత్‌ సెమీ హై స్పీడ్‌ రైలు విజయవాడకు అతి త్వరలో రాబోతోంది. వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ లను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర రైల్వే బోర్డులు నిర్ణయించాయి. అందులో భాగంగా.. దక్షిణ మధ్య రైల్వేకు వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అవకాశం దక్కింది. ఈ ఎక్‌ప్రెస్‌ను బెజవాడకు నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం కూడా ఆమోదముద్ర వేశారు. విజయవాడ - సికింద్రాబాద్‌ గోల్డెన్‌ డయాగ్నల్‌ రూట్‌, విశాఖపట్నం - విజయవాడ గోల్డెన్‌ క్వాడ్రలేట్రల్‌ రూట్‌లను పరిశీలిస్తున్నారు. ఏ రూట్‌లో నడపాలన్న దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.

బెజవాడ - సికింద్రాబాద్‌ మధ్య కానీ, విశాఖ - విజయవాడ - సికింద్రాబాద్‌ మధ్య కానీ ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌, విజయవాడ - విశాఖ మధ్య అత్యంత వేగంతో నడిచే సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో గోదావరి, ఫలక్‌నుమా, శాతవాహన, విశాఖ, సింహపూరి, కోణార్క్‌, గోల్కొండ, గౌతమి, దురంతో, గరీబ్‌రథ్‌ వంటి అనేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం ఆయా రూట్ల మధ్య గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి. వందేభారత్‌ సెమీ హైస్పీడ్‌ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. రైల్వే అధికారులు 180 కిలోమీటర్లకు సర్టిఫై చేశారు. ట్రాక్‌ ఇన్ర్ఫాను బట్టి 160 కిలోమీటర్లకు అనుమతిస్తారు. వందేభారత్‌ రైలులో కోచ్‌లు అత్యంత అధునాతనంగా ఉంటాయి.


Next Story
Share it