విపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం క్షమార్హం కాదు : బీజేపీ ఎంపీ

Sujana Chowdary Comments On YCP Leaders. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు సభ్యులు విపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ఆయన కుటుంబ

By Medi Samrat  Published on  19 Nov 2021 11:38 AM GMT
విపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం క్షమార్హం కాదు : బీజేపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు సభ్యులు విపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదని బీజేపీ ఎంపీ సుజానా చౌద‌రి అన్నారు. సభా నాయకుడిగా వున్న ముఖ్యమంత్రి ఇలాంటివారిని ప్రోత్సహించడం తగదని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలపై వుండాలి.. కానీ ప్రస్తుతం వ్యక్తులను దాటి, కుటుంబం వరకు వెళ్లిందని.. ఇది సరైన విధానం కాదని అన్నారు. ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం.. అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఉన్నత విలువలతో, సంస్కారవంతమైన భాషతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయమ‌న్నారు. రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివేచన కలిగినవారంతా ఇలాంటి ఘటనలను ఖండించాలని కోరారు. వ్యక్తిత్వం లేని నేలబారు నేతలను చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే వుంటాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మన పిల్లల కోసం మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే దిగజారుడు నేతలను దూరం పెట్టాలని.. లేదంటే భవిష్యత్తు తరాలు రాజకీయ నాయకులన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా అసహ్యించుకునే ప్రమాదం వుందని సూచించారు. కాబట్టి పార్టీలకు అతీతంగా నేతలంతా రాజకీయాల్లో విలువలను కాపాడేందుకు ప్రయత్నించాలని కోరుతున్నానని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.


Next Story
Share it