అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లాలోని చదలవాడ దగ్గర కొనసాగుతున్న మహాపాదయాత్రలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొన్న రైతు నాగార్జున చేయి విరిగింది. రైతు నాగార్జునది సంతనూతలపాడు. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యహరిస్తున్న తీరు సరిగా లేదని.. పాదయాత్రలో పాల్గొనడానికి వస్తున్న ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని అన్నారు.
రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారని పాదయాత్రలో పాల్గొన్న రైతులు అంటున్నారు. ఇక పోలీసుల ఆంక్షల మధ్య పాదయాత్ర కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రాజధాని రైతులు, మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు. నాగులుప్పలపాడులో వర్షం కురుస్తుండడంతో రెయిన్‌కోట్లు, గొడుగులు పట్టుకుని పాదయాత్ర చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాదయాత్ర సాగుతుందని రైతులు చెప్తున్నారు. పాదయాత్ర డిసెంబర్ 15న తిరుపతిలో ముగియనుంది. నిన్న రాత్రి రైతులు బస చేసిన గుడారాలు వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.