టీడీపీ మంత్రులు, ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎంపీలు కొంత మంది హాజరుకాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్‌కు ఎందుకు రాలేదో చెప్పాలని సీరియస్ అయ్యారు. ఈ మీటింగ్ సందర్భంగా మంత్రులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద కార్యక్రమంలో తనకు కావాల్సింది ఫొటోలకు ఫోజులు కాదని, ఫలితాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. సోషల్ మీడియాను సరిగా వినియోగించుకోవడంతో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. పార్టీ సమావేశానికి కొందరు ఎంపీల గైర్హాజరుపై లావు శ్రీ కృష్ణ దేవరాయుల్ని సీఎం ప్రశ్నించారు. పార్టీ సమావేశాల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా? అంటూ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై సీఎం ఫైర్ అయ్యారు.
ప్రతీ పార్లమెంట్‌లో పరిధిలోని ఎమ్మెల్యేలు.. ఎంపీ, ఇన్చార్జ్ మంత్రి, జోనల్ ఇన్చార్జ్ సమన్వయంతో పని చేయాలని టీడీపీ అధినేత సూచించారు. గ్రౌండ్ లెవెల్‌లో సమస్యలను ఎప్పటికప్పుడు జోనల్ ఇన్చార్జులు, ఇన్చార్జ్ మంత్రులకు చెప్పి సమస్య పరిష్కరించేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే పొరపాటు చేస్తే ఇన్‌చార్జ్ మంత్రిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఇన్‌చార్జ్ మంత్రి, ఎంపీ పని తీరు, జిల్లాలో పథకాల అమలు తదితర అంశాల ఆధారంగా సీఎం చంద్రబాబు వారికి ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలవడం గమనార్హం. చివరి మూడు స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి.