ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన ఆయన విజయవాడ బుక్ ఫెయిర్ ను శనివారం ఉదయం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్ళి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్ లో పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకూ పలువురి రచనలను కొనుగోలు చేశారు. అదే విధంగా ప్రాచీన సాహిత్యంపై వెలువరించిన విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలను ఎంచుకున్నారు. వీటితో అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాతిక సంబంధిత రచనలు పరిశీలించి కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా తనకు ఎంతో నచ్చిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం చూసి ఎంతో సంతోషించారు. డా.విక్టర్ ఈ.ఫ్రాంకిల్ రాసిన ఈ పుస్తకం చదివితే నిరాశానిస్పృహలు అధిగమించి ఆశావాద భావన కలుగుతుందని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల నిర్బంధాల్లో ఉన్న ఫ్రాంకిల్ ఎలా భవిష్యత్ జీవితాన్ని నిలుపుకున్నాడో ఆ రచన తెలుపుతుందని చెబుతూ బహుమతిగా ఇవ్వడానికి ఉంటాయని ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాలు కొనుగోలు చేశారు. అదే విధంగా భారతీయ చట్టాలు, చరిత్ర, రాజకీయ, పబ్లిక్ పాలసీ, శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, వృక్ష, పర్యావరణ సంబంధిత పుస్తకాలపై ప్రత్యేక ఆసక్తి చూపారు.