అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనకు సిద్ధం అయ్యారు. రేపు పవన్ కల్యాణ్ వైజాగ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటంలో పాల్గొననున్నారు. ఓ వైపు కేంద్రం ప్రభుత్వం.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపడుతుంటే.. ప్రైవేటీకరణను ఆపాలంటూ కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే కార్మికుల పోరాటానికి బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇక జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ రేపు ప్రత్యక్షంగా కార్మికుల పోరాటానికి మద్దతు తెలపనున్నారు. పర్యటనలో భాగంగా పవన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే బహిరంగ వేదిక ఎక్కడ పెట్టాలన్న దానిపై క్లారిటీ లేదు.
మొదటగా స్టీల్ ప్లాంట్ రోడ్డుపై వేదిక ఏర్పాటు చేసేందుకు జనసేన శ్రేణులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి లారీల్లో స్టేజ్ మెటీరియల్‌ను తరలించారు. అయితే ఆ ప్రాంతంలో సభ ఏర్పాటుకు పోలీసులు మాత్రం ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పోలీసులు, సభ నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం వల్లే వేదిక ఏర్పాటు సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. జాతీయ రహదారిపై సభ ఏర్పాటు చేస్తే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ సభకు ప్రజలు రాకుండా ఉండేందుకే పోలీసులు అభ్యంతరాలు చెబుతున్నారని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా పవన్ బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై మాత్రం తెలియాల్సి ఉంది.