రాజధాని అభివృద్ది పనులను రెండున్నర్రేళ్లలో పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ

రాష్ట్ర రాజధాని అయిన అమరావతి అబివృద్ది పనులను రానున్న రెండున్నర్రేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  16 Jun 2024 4:03 PM IST
రాజధాని అభివృద్ది పనులను రెండున్నర్రేళ్లలో పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ

రాష్ట్ర రాజధాని అయిన అమరావతి అబివృద్ది పనులను రానున్న రెండున్నర్రేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.06 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యుత్తమమైన డిజైన్ ను రూపొందించి అమలు పర్చడం జరిగిందన్నారు. రాజధానిలో చేపట్టే ఎటు వంటి అభివృద్ది కార్యక్రమమైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ది చెందే విధంగా సింగపూర్ ప్రభుత్వం సహాయంతో అత్యుత్తమమైన డిజైన్ ను రూపొందించి అమలు పర్చామన్నారు. రాష్ట్ర రాజధానికి సంబందించి అత్యుత్తమైన డిజైన్ను రూపొందించేందుకు సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేషియా తదితర దేశాలను కూడా సందర్శించడం జరిగిందన్నారు. రాజధానిలో మెజారిటీ ప్రాంతం కవర్ అయ్యే విధంగా మౌలిక వసతుల కల్పనతో పాటు మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణానికి తొలి దశలో పనులను చేపట్టేందుకు గతంలో రూ.48 వేల కోట్ల తో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించి, దాదాపు రూ. 9 వేల కోట్ల చెల్లింపులను కూడా చేయడం జరిగిందన్నారు. మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణం కూడా దాదాపు 90 శాతం పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో భాగంగా 2015 జనవరి 1 న ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 వ తేదీ అర్థరాత్రికల్లా ఎటు వంటి లిటిగేషన్ లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందజేశారన్నారు. అటు వంటి రాజధాని అభివృద్ది విషయంలో గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి గతంలో ఎంతో స్టడీ చేసి మంచి అనుభవాన్ని సాధించడం జరింగిందని, అదే దృష్టితో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మళ్లీ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు తమ అప్పగించారన్నారు. నేటి నుండీ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ రానున్న పదిపహేను రోజుల్లో ఒక క్లారిటీకి వచ్చి, ఏ సమయంలోపు ఏది పూర్తి చేస్తాము అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు.

ఈ సందర్బంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ రాజధాని అభివృద్ది విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్నే అమలు పరుస్తామన్నారు. అమరావతి అభివృద్ది పనులను మూడు దశల్లో నిర్వహించేందుకు గతంలో ప్రణాళిక రూపొందించి అమలు పర్చడం జరిగిందన్నారు. అమరావతి రాజధాని అభివృద్దికి తొలిదశలో రూ.48 వేల కోట్లు అవుతాయని అంచనా వేయడం జరిగిందన్నారు. ఈ తొలి దశ పనులతో సీటీ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ..

ఆదివారం ఉదయం 9.06 గంటల సమయంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ గ్రౌండ్ ప్లోర్లో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతోను అధికారులు పుష్పగుచ్ఛాలతోను ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా ఆ భగవంతునికి పూజలు జరిపిన తదుపరి తమ సీటులో ఆసీనులయ్యారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సిఎస్ వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఏ శ్రీధర్, సి.ఆర్.డి.ఏ. కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిఫిల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, సిఆర్డిఏ చీఫ్ ఇంజనీర్ లు ఎన్.వి.ఆర్.కె. ప్రసాద్, సిహెచ్.ధనంజయ్ తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

Next Story