కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రేపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ నేఫథ్యంలో విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని ఎన్నికపై స్పందించారు. ఈరోజు కూడా సమావేశంలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారని.. హాజరు తీసుకోమని ఆర్.ఒ ఆదేశించగానే.. బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారని అన్నారు. కోర్టు ఆదేశాలతో జరిగే ఎన్నిక అయినా.. అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని కేశినేని నాని ఆరోపించారు.
వైసీపీ సభ్యులు ఈ రెండు రోజులు అరాచకం, హడావుడి చేశారని.. ఎన్నికల అధికారి సరైన వివరణ ఇవ్వకుండా ఎన్నిక వాయిదా వేశారని అన్నారు. హైకోర్టు కూడా ఈ రోజు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిందని.. రేపు పదిన్నరకు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ సభ్యులను పోలీసులు పూర్తి భద్రతతో తీసుకురావాలని హైకోర్టు సూచించిందని తెలిపారు. రేపైనా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నామన్నారు. వైసీపీ సభ్యుల తీరుపై ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా సభ్యులు ధైర్యంగా నిలబడ్డారని.. క్యాష్ కన్నా క్యారెక్టర్ ముఖ్యమని నిలబడిన మా సభ్యులకు నా ధన్యవాదాలు అని నాని అన్నారు