మీ వాహనంలో ఇంధనం అయిపోయిందా.. అయితే వెంటనే ఈ యాప్ డౌన్ లోడు చేసుకుని.. ఇంధనం బుక్ చేసుకోండి. కొన్ని నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరకి ఇంధనం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇంటి దగ్గరికే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్ సరఫరా చేయనున్నట్లు బీపీసీఎల్ సౌత్ డీజీఎం పి.పి.రాఘవేంద్రరావు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీఎం భాస్కరరావు తెలిపారు.
నగరంలోని గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర మంగళవారం నాడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ బుక్ చేసుకోవాలంటే బీపీసీఎల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇంధనం బుక్ అయిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డెలివరీ చేస్తామని తెలిపారు. ఫెసో క్యాన్ ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. దీంతో పాటు గాంధీనగర్‌లోని భారత్ పెట్రోలియం బంకులో సిబ్బందితో పని లేకుండా వినియోగదారుడే స్కాన్ చేసి పెట్రోల్ నింపుకునే సౌకర్యం కూడా ఉందని తెలిపారు. ఈ రకమైన పద్ధతి ద్వారా మోసాలను కట్టడి చేయవచ్చన్నారు. 5 శాతం క్యాష్ వస్తుందని, క్యాష్ బ్యాక్ ఆఫర్ 30 రోజుల పాటు ఉంటుందని తెలిపారు.