కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ ఎన్నిక సజావుగా జరిపించాలని టీడీపీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో వాడివేడీగా వాదనలు జరిగాయి. నిన్న, ఈ రోజు వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించారని టీడీపీ తరపు లాయర్ అశ్విని కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నం 2.15 నిమిషాలకు కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని విజయవాడ సిపి, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేఫథ్యంలోనే కొండపల్లి మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి, విజయవాడ ఇన్‍ఛార్జ్ సీపీ ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలని ఎస్ఈసీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. ఫలితాలు ప్రకటించవద్దు, వివరాలు కోర్టుకు అందించాలని ఆదేశించింది.