అమరావతి గ్రీన్ సిటీ కోసం సర్కార్ చర్యలు..జపాన్‌లో రాష్ట్ర బృందం పర్యటన

అమరావతిని గ్రీన్‌ అండ్‌ రెసిలియంట్‌ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

By -  Knakam Karthik
Published on : 12 Sept 2025 10:53 AM IST

Andrapradesh, Amaravati, Ap Government, State team Japan Tour

అమరావతిని గ్రీన్‌ అండ్‌ రెసిలియంట్‌ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు సభ్యుల అధికార ప్రతినిధి బృందం ప్రస్తుతం జపాన్‌లోని యోకోహామా సిటీలో ఐదు రోజుల అధ్యయన పర్యటనలో ఉంది. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ (MAUD) డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్. సురేష్‌ కుమార్‌ అధ్వర్యంలో ఉన్న ఈ బృందంలో, క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ అదనపు కమిషనర్లు జి. సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌, మల్లారపు నవీన్‌ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ బృందం యోకోహామా నగరంలో "క్లైమేట్‌ యాక్షన్‌, స్మార్ట్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సిటీ మేనేజ్‌మెంట్‌లో టెక్నాలజీ వినియోగం మరియు ఆర్థిక అభివృద్ధి" నమూనాలను కూడా అధ్యయనం చేస్తోంది. సురేష్‌ కుమార్‌ హోకుబు స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను సందర్శించగా, తర్వాత వర్షపు నీరు, మలిన జలాలు, డ్రైనేజ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం యోకోహామా కంట్రోల్‌ సెంటర్‌ను కూడా పరిశీలించారు. యోకోహామా పాలన సంస్థ ఆంధ్రప్రదేశ్‌ బృందానికి, నగరాన్ని జపాన్‌లో ప్రధాన వృద్ధి కేంద్రంగా ఎలా మలిచారో దాని విజన్‌ను ఆరు ప్రధాన ప్రాజెక్టుల మాస్టర్‌ప్లాన్‌గా అమలుచేసిన విధానాన్ని వివరించింది.

విభాగాల మధ్య సమన్వయం, ముఖ్యంగా రవాణా మరియు నగరాభివృద్ధి సమన్వయం, అర్బన్‌ డిజైన్‌ అంశాలపై దృష్టి, అలాగే ప్రైవేట్‌ రంగం సహకారాన్ని అర్బన్‌ డెవలప్మెంట్‌లోకి తీసుకురావడం వంటి అంశాలే యోకోహామా రూపాంతరానికి కీలకంగా నిలిచాయి. 1,800 గ్లోబల్‌ కంపెనీల కార్యాలయాలు ఉన్న యోకోహామా, పరిశోధకులు మరియు ఇంజినీర్లకు ఉత్తమమైన వ్యాపార వాతావరణ కేంద్రంగా పేరుపొందింది. యోకోహామా తమ సొంత అర్బన్‌ డెవలప్మెంట్‌ మోడల్‌పై ఆధారపడి, నగర ప్రణాళిక నుంచి ఆపరేషన్‌ వరకు మొత్తం విలువ శ్రేణిలో విస్తృత సేవలను అందించడానికి ఆసక్తి కనబరిచింది. సిటీ-టు-సిటీ భాగస్వామ్యానికి ఒక భాగంగా, యోకోహామా సమగ్ర అర్బన్‌ డెవలప్మెంట్‌ ప్లాన్‌ మరియు అర్బన్‌ డిజైన్‌ అమలుపై ఒక చట్రాన్ని అందించడానికి, ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, "సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, మలిన జలాలు, స్లడ్జ్‌, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌, పునరుత్పాదక ఇంధనం" తదితరాల కోసం స్మార్ట్‌ టెక్నాలజీని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.

Next Story