దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
government failed organizing Dussehra celebration. దసరా ఉత్సవాల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్రీయ బ్రాహ్మణ
By Medi Samrat
దసరా ఉత్సవాల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు కె శివశర్మ అన్నారు. శనివారం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. దుర్గమ్మ భక్తులను దర్శనానికి ఇబ్బందులకు గురిచేసి వైసీపీ నాయకులకు పెద్దపీట వేసారని ఆరోపించారు. దసరా ఉత్సవాలు కాకుండా.. వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిపినట్లు చేశారని తీవ్రవిమర్శలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. అధికార యంత్రాంగం మొత్తం వైసీపీ నేతల చెప్పు చేతల్లో నడిచారని ఆరోపించారు.
సామాన్య భక్తులు వృద్దులు, మహిళలు చంటి పిల్లలతో టికెట్లు తీసుకుని దర్శనం దొరకక క్యూ లైన్ లలో గంటల తరబడి ఇబ్బందులు పడ్డారని.. అయినా ఏమాత్రం అధికారుల్లో చలనం లేదన్నారు. దేవాదాయశాఖ, రెవెన్యూ విజిలెన్స్ విభాగాల అధికారులు మొత్తం ఎంతో దూరం నుంచి వచ్చిన అమ్మవారి భక్తులను పట్టించుకోకుండా వైసీపీ నాయకుల భజనలో తరించారన్నారని విమర్శలు గుప్పించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన అనుచరులు, బంధువులు, స్నేహితులు వందలమందిని వారి సొంత కార్లలో కొండపైకి అమ్మవారి దర్శనానికి పంపి సామాన్య భక్తులను ఇబ్బందులకి గురిచేశారని శివ శర్మ విమర్శించారు.
ఎక్కడి నుంచో విధులు నిర్వహించటానికి వచ్చిన పోలీసులు.. అమ్మవారి భక్తులైన మహిళలపై అసభ్యకరమైన పదజాలం వాడి అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. మంత్రి వెల్లంపల్లి అమ్మవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వెల్లంపల్లి తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు. దేవాదాయశాఖ మంత్రిగా చేసిన వారికి రాజకీయ భవిష్యతు ఉండదని.. ఇది చరిత్ర చెప్తున్న సత్యమని.. ఎందరో దేవాదాయశాఖ మంత్రులు రాజకీయ మనుగడ లేక కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని మంత్రి వెల్లంపల్లి గుర్తుంచుకోవాలని శివశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం అవినీతికి పాల్పడే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయ భవిష్యతు సమాధి కాబోతోంది అని శివశర్మ వ్యాఖ్యానించారు.