ఏపీలో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు స్కీమ్‌లో భాగంగా వారికి స్థలం కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇళ్లు స్థలం పొందే లబ్ధిదారులు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదని, బీపీఎల్ కుటుంబం అయి ఉండాలని పేర్కొంది. కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని స్పష్టం చేసింది. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి భూమి ఉండకూడదని స్పష్టం చేసింది.
ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరు 15-10-2019 నాటికి అప్లికేషన్ చేసుకుని ఉండాలని చెప్పింది. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాంటి వారికి తాము కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.