ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇస్తున్న నోటీసులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు. దశాబ్దాల కాలం నుండి ఒక ఇంటిలోని పోర్షన్ ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ.. ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని.. ఫలితంగా మీటర్ రీడింగ్ విపరీతంగా పెరిగి, అత్యధికంగా విద్యుత్ ఛార్జీల భారం వినియోగదారులపై పడడం ఖాయమని రామకృష్ణ అన్నారు.
అమ్మఒడి, వృద్ధాప్య, వితంతు పెన్షన్ ల వంటి పలు సంక్షేమ పథకాల అమలును కరెంట్ బిల్లుతో ముడి పెట్టడం గమనార్హం. ఇప్పటికీ జగన్ సర్కార్ ఓటిఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఉందని ఆరోపించారు. ఇప్పుడు విద్యుత్తు మీటర్ల తొలగింపుతో ప్రజలపై గుదిబండ మోపేందుకు సిద్ధమైందని విమర్శించారు. సంక్షేమ పథకాలలో కోతలు విధించేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ పంపిణీ సంస్థలు మీటర్ల రద్దు ప్రక్రియను విరమించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.