వికేంద్రీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు : సీఎం జగన్
CM Jagan Speech in AP Assembly.ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తగ్గేదే లేదని అంటున్నారు సీఎం జగన్. వికేంద్రీకరణ
By తోట వంశీ కుమార్ Published on 24 March 2022 8:03 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తగ్గేదే లేదని అంటున్నారు సీఎం జగన్. వికేంద్రీకరణ అంశంపై అసెంబ్లీ వేదికగా జగన్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. రాజధానుల వికేంద్రీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఎవరెవరి పరిధి ఏమిటనేది స్పష్టంగా వివరించారని, వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావన్నారు. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయన్నారు.
ఇక చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉంటుందంటూ సీఎం స్పష్టంచేశారు. శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులు చెప్పలేవన్నారు. మంచి చట్టాలు తీసుకొస్తే ప్రజలు మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, లేకపోతే తిరస్కరిస్తారన్నారు. రాజ్యాంగాన్ని, రాష్ట్ర అధికారాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి ప్రాంతంపై ప్రేమ ఉందని, అందుకే తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు.
అభివృద్ది అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్లే రాష్ట్ర విభజన వచ్చిందని, వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందన్నారు. మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంలో ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమపై ఉందని, రైతుల ప్రయోజనాలు కాపాడుతామని జగన్ భరోసా ఇచ్చారు. అమరావతిని నెల రోజుల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పిందని.. ఆచరణకు సాధ్యం కాని విధంగా ఆదేశాలు ఉండొదన్నారు.
ధర్మాసనంపై విశ్వాసం ఉందని.. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయమని చెప్పారు. ఎందుకంటే వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ది. అందరి ఆత్మగౌరవం అందులో ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణ బాటలో సాగటం మినహా మరో మార్గం లేదన్నారు. రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉందన్నారు. అందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందన్నారు.