పక్కా ఇళ్ళపై పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించడానికే ఓటీఎస్
Botsa Satyanarayana Fires On TDP Leaders. పేదల పక్కా ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంటు(ఓటిఎస్)
By Medi Samrat
పేదల పక్కా ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంటు(ఓటిఎస్), జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రజలకు మేలు చేయడానికి, ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం కోసమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పేదల ఇళ్ళపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, ఆపదలో ఉన్నప్పుడు ఆ ఇంటి పట్టా శాశ్వత హక్కుదారుడిగా బ్యాంకుల్లో రుణం పొందడానికిగానీ, అవసరమైతే అమ్ముకోవడానికిగానీ, చట్టపరమైన ఆస్తిగా తమ పిల్లలకు రాసి ఇచ్చుకునేందుకుగానీ వీలు కల్పిస్తూ.. ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ తెచ్చారన్నారు.
అటువంటి మంచి పథకంపైన చంద్రబాబు, టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, పేదవాడిపై రాజకీయాలు చేస్తే.. అటువంటి పార్టీలకు, వ్యక్తులకు పుట్టగతులు ఉండవని మంత్రి బొత్స మండిపడ్డారు. ఓటిఎస్ పథకం అన్నది ఎవరినీ బలవంతం చేయడానికో, లేక షరతులు విధించడానికో కాదని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం పరిధిలో సంతబొమ్మాళిలో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సర్క్యులర్ కు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అందులో రాజకీయ, కుట్ర కోణం దాగి ఉందని, అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు.
పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని, సంక్షేమ పథకాన్ని తీసుకువస్తే దాన్ని చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి చెందిన దుర్మార్గపు శక్తులు దానికి వక్రభాష్యం చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతి ఒక్క పేదవాడికీ పక్కా ఇల్లు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలు-పేదలందరికీ పక్కా ఇళ్ళు పథకాన్ని ప్రవేశపెడితే దానిమీద న్యాయస్థానికి వెళ్లి కోర్టుల్లో స్టే తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వీటన్నింటిని పరిశీలించిన కోర్టు.. ఆ పథకాన్ని కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టులను ఆశ్రయించడం ద్వారా ఆ పథకం అమలు కాకుండా ఆర్నెళ్ళపాటు అడ్డంకులు సృష్టించారు. పేదవాడికి ఈ ప్రభుత్వం మంచి చేస్తుంటే.. ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.