విజయవాడ దుర్గగుడి ఛైర్మన్‌పై హత్యాయత్నం
దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేశాడు.
By Medi Samrat Published on 25 Nov 2023 8:08 AM ISTదుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబుపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై దాడి చేశాడు. దీంతో ఆయన కడుపుకు గాయాలు కావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. రాంబాబుకు చికిత్స చేసిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని తెలిపారు.
ఇదిలావుంటే.. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తండ్రి ఇటీవలే మరణించారు. స్మశానం తండ్రి సమాధి వద్ద దీపం పెట్టడానికి శుక్రవారం రాంబాబు వెళ్లారు. దీపం పెట్టి కాళ్లు కడుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుండి వచ్చి సీసాతో ఆయనపై దాడి చేశాడు. దాడిని పసిగట్టి పక్కకి తప్పుకోవడంతో గాజుసీసా కడుపులో దిగింది.
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీపీ ఛైర్మన్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ ఘటనపై విజయవాడ నార్త్ ఏసీపీ రవికాంత్ మాట్లాడారు. “దుర్గగుడి చైర్మన్ పై ఈ రోజు సాయంత్రం దాడి జరిగింది. ఇటీవల కర్నాటి రాంబాబు నాన్న చనిపోగా… ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు. సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న గుంజ కృష్ణ డబ్బులు అడగటం జరిగింది. కృష్ణకి డబ్బులు తక్కువ ఇచ్చినందుకు దాడి చేశాడు. మద్యం మత్తులో గుంజా కృష్ణ దాడి చేశారు. దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు. దాడి చేసిన కృష్ణ అనే వ్యక్తి స్మశానంలో కాటికాపరిగా నివాసం ఉంటున్నాడు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం రాంబాబును ఇంటికి పంపించటం జరిగింది” అని పేర్కొన్నారు.