ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.25 వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రుణ ఒప్పందంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరును చేర్చింది. కాగా వ్యక్తిగతంగా తన పేరును చేర్చడంపై గవర్నర్ బిశ్వభూషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తీరు పట్ల గవర్నర్ అసహనంతో ఉన్నారు. దీంతో ఆయనకు వివరణ ఇచ్చేందుకు సీఎం క్యాంపు కార్యాలయం, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు పరుగులు పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల హైకోర్టు.. రుణ ఒప్పందంలో గవర్నర్ పేరును ఎలా చేరుస్తారంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి అధిపతి గవర్నర్.. సర్కార్ కార్యకలాపాలన్నీ గవర్నర్ పేరు మీదనే జరుగుతాయి. అయితే గవర్నర్ పేరును ఎక్కడా కూడా ప్రస్తావించారు. ఇక ప్రభుత్వం జారీ చేసే జీవోల్లో సైతం 'ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్' అని మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న రుణ ఒప్పందంలో గవర్నర్ పేరును చేర్చారు. ఒక వేళ ఒప్పందంలో భాగంగా నోటీసులు ఇవ్వాల్సి వస్తే.. ఎవరికి ఇవ్వాలన్న చోట బిశ్వభూషన్ హరిచందన్ అని గవర్నర్ పేరు రాశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒప్పంద పత్రాల్లో ప్రభుత్వం సంతకం పెట్టాల్సిన చోటా ఏపీ గవర్నర్ అని రాసి, దాని కింద ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంతకం చేశారు.