పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించడంపై ఏపీ ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు
AP Finance Minister Rajendranath Reddy Comments On Petrol Prices. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గించిన తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పన్నులను
By Medi Samrat Published on 8 Nov 2021 11:48 AM GMTకేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గించిన తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ముందుకు రాలేదు. ఇంధన ధరల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అనంతమాత్రంగానే ఉందని ఈ సమయంలో ధరలు తగ్గిస్తే రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడే అవకాశం ఉందని వివరించారు. కేంద్రానికి ఉన్నన్ని ఆర్థిక వనరులు రాష్ట్రాలకు ఉండవని, కేంద్రం నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడం కుదరదని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం చెప్పామని.. ప్రస్తుతానికి తాము వ్యాట్ తగ్గించలేమని బుగ్గన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయ వనరులు చాలా అవసరమని… రాష్ట్రానికి చమురు ఉత్పత్తులు, మద్యం ద్వారా మాత్రమే నేరుగా పన్నుల రూపంలో ఆదాయం వస్తోందన్నారు. మిగతావన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయని అన్నారు. అందువల్ల రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు అంత సులభంగా తీసుకోలేమన్నారు.
ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.116 వరకు తీసుకెళ్లిందని.. రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను ఎక్కడికి తీసుకెళ్లారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఢిల్లీ నార్త్ బ్లాక్ వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏవీ గుర్తుండవని బీజేపీ నేతలు భావిస్తున్నట్టుందని.. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గర్వభంగం చేశారు కాబట్టి బీజేపీ నేతలకు మళ్లీ ప్రజలు గుర్తుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రం రూ.2.87 లక్షల కోట్లు వసూలు చేస్తోందని, ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.47 వేల కోట్లు వసూలు చేస్తోందని వివరించారు. రూ.5, రూ.10 కాదు లీటర్ పై రూ.30 తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశమంతా తగ్గించిందని, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే తగ్గించలేదని ప్రచారం చేస్తున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు కేంద్రం దొంగచాటు చర్యలను గమనిస్తున్నాయనారు. పన్నులు విధిస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్ ల రూపంలో వసూలు చేస్తున్నారు. పన్నుల రాబడి పంపకం విధానంలో రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒకాయన వెనుక నుంచి ఎగదోయడానికి బయల్దేరాడు. 9వ తేదీన ధర్నాలు చేస్తాడంట! మనం అధికారంలో ఉన్నప్పుడు ఏంచేశాం అనేది ఆలోచించుకోవాలని విమర్శలు చేశారు. ధర్నాలు చేయడానికి సిగ్గుండాలని అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఇచ్చిన స్క్రిప్టునే బీజేపీ నేతలు చదువుతున్నారని పేర్ని నాని విమర్శించారు.