ఆంధ్రప్రదేశ్‌లోని హోటళ్ల యజమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు అర్ధరాత్రి 12:00 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రయాణికులు, సినీ ప్రేక్షకులు, కార్మికులు రాత్రి వరకు ఆహారం తినొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి 10:30 గంటలకు మూసివేస్తున్నారు.
ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి. స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అనుమతి లభిస్తే అర్థరాత్రి వరకు ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి వీలు కలుగుతుందన్నారు. అంతేకాకుండా తమ వ్యాపారాలు కూడా మెరుగుపడతాయని, పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు డబ్బులు చేరుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2,500 హోటళ్లు, 10,000 చిన్న హోటళ్లు, 40,000 రెస్టారెంట్లు ఉన్నాయి.