అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మెరుగైన బిల్లుతో వస్తాం : సీఎం జగన్

AP CM Jagan On 3 Capitals. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం

By Medi Samrat  Published on  22 Nov 2021 10:16 AM GMT
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మెరుగైన బిల్లుతో వస్తాం : సీఎం జగన్

రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవని సీఎం జ‌గ‌న్ అన్నారు. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో.. వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగిందని ఆయ‌న తెలిపారు. గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయిందని సీఎం అన్నారు.

మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని.. అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసిందని.. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామ‌ని జ‌గ‌న్ తెలిపారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు.. వీరందరి ఆశలూ, ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే.. వాటిని ఆవిష్కరించింది కాబట్టే.. ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారని అన్నారు. అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశాం.

ఈ నేపధ్యంలోనే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగాగానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని సీఎం తెలిపారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు.


Next Story