నాడు ఎన్టీఆర్ ను.. నేడు భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు : అంబటి రాంబాబు

Ambati Rambabu Fires On Chandrababu. వరుస ఓటములతో టీడీపీ పుట్టి మునిగిపోవడంతో, రాజకీయ అమ్ములపొదిలో ఏ అస్త్రాలు లేక

By Medi Samrat
Published on : 19 Nov 2021 6:39 PM IST

నాడు ఎన్టీఆర్ ను.. నేడు భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు : అంబటి రాంబాబు

వరుస ఓటములతో టీడీపీ పుట్టి మునిగిపోవడంతో, రాజకీయ అమ్ములపొదిలో ఏ అస్త్రాలు లేక, చివరి అస్త్రంగా ఏడుపు అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సచివాలయంలోని మీడియా పాయింట్ లో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. పదవికన్నా, మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులు ఎవ్వరూ తనకు ముఖ్యం కాదని, ఈరోజు తన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగటం పట్ల మరోసారి బాబు తన నీచ మనస్తత్వాన్ని రుజువు చేసుకున్నారని దుయ్యబట్టారు. పదవి కోసం చంద్రబాబు, ఎన్ని ఘోరాలు, నేరాలు చేశారో రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.

ఇంతకాలం ప్రజల్ని ఏడిపించిన చంద్రబాబు.. మీడియా ముందుకు వచ్చి ఏడ్చాడంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు.. నాడు ఎన్టీఆర్ ను.. నేడు భార్యను అడ్డుపెట్టుకుని దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని తూర్పూరబట్టారు. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు ఏడ్చేసి సానుభూతి పొందాలంటే ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు అసెంబ్లీని నిష్క్రమించడం కాదని, రాజకీయాల నుంచే నిష్క్రమణ ఖాయమని చెప్పారు. చంద్రబాబు భార్య గురించి సభలో ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడలేదని, మాట్లాడారని మీ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.


Next Story